SANKRANTHI CELEBRATIONS

SANKRANTHI CELEBRATIONS

సంక్రాంతి సంబరాలు

తెలుగు వారి పెద్దపండుగ సంక్రాంతి.

నెల రోజులపాటు జరుపుకునే పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో దైవానికి సంబంధించినవే.!

కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. రైతుల పండుగ. కళాకారుల పండుగ. ఈ పండుగ కు మూలపురుషుడు రైతన్న.ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది.

తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు.వాళ్ళ వివరాలు తెలుసుకుందాం.

       బుడబుక్కలవాడు:

ఈ పండుగ కళారూపాలలో తొలి *తాంబూలం బుడబుక్కలవానిది.

పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిఝూములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ క్రొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా 'కట్టు' కట్టి కట్టడి చేసేవాడు బుడబుక్కలవాడు.ఇతను తొలిఝామంతా పంటకు కాపలా కాసి రెండోఝాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతాడు


        జంగందేవర:

సాక్షాత్తూ శివుని అవతార అంశలుగా భావించే ఈ జంగందేవరలు శంఖనాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర!

           హరిదాసు:

'హరిలో రంగ హరి'అంటూ శ్రీకృష్ణుని గాధలను కీర్తిస్తూ ఇంటింటి ముంగిటికీ వచ్చి పొలం వెళ్ళిన రైతుల క్షేమసమాచారాలను వాళ్ళ ఇళ్ళలో తెలుపుతూ హరినామసంకీర్తనామృతాన్ని దోసిళ్ళతో అందించి దోసెడు బియ్యాన్ని కృష్ణార్పణమంటూ స్వీకరిస్తాడు.ఆ యదుకులేశుని ఆశీస్సులను తన ద్వారా మనకు అందిస్తాడు.

              గంగిరెడ్లు:

హరిదాసు ఇంటిలోని వారిని పలకరించి ఇంటి ఆడపడుచులు వేసిన రంగవల్లులపై కృష్ణపరమాత్మ ఆశీస్సులు కురిపించాక

 'అయ్యగారికి దండం పెట్టు

 అమ్మగారికి దండం పెట్టు

 బాబుగారికి దండంపెట్టు

 పాపగారికి దండం పెట్టూ'

అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి,రైతు బ్రతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటి ముంగిట్లో ఎడ్ల ఆట ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించిన గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి ఊదుకుంటూ వెళ్ళిపోతారు

            పిట్టలదొరలు:

గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు,కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. తనకు ఆరేబియా సముద్రంలో ఆరువేల ఎకరాల భూమి ఉందని,బంగాళాఖాతంలో బంగ్లాలున్నాయని ఆ బంగ్లాలకు వెళ్ళడానికి సరైన దారిలేక ఈమధ్యనే బొప్పాయి కలపతో బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టించాననీ అవన్నీ పిల్లలు అడిగితే ఇచ్చేస్తానని డంబాలు పోతాడు.పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు

                  సోదెమ్మ

  సోదెమ్మ వెళ్ళిన తరువాత మన భవిష్యత్ ఫలాలను చెబుతానంటూ

'సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను

ఉన్నదున్నట్టు చెబుతాను లేనీదేమీ చెప్పను తల్లీ'అంటూ మన భావిలో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర,రవికల గుడ్డ పెట్టించుకుని పోతుంది.

                   భట్రాజులు:

ఆరు నెలల కష్టానికి ఫలితం వచ్చేవేళలో ధాన్యాన్ని ఇంటికి తరలించే సమయంలో రైతుల కళ్ళాలలోకి వెళ్ళి రైతుని ఆతని వంశాన్ని ఆతని పెద్దలనూ పొగడుతూ ఆ రైతు కుటుంబం నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ పద్యాలల్లి ఆశీస్సులను వెదజల్లి ఓ కుంచెడో రెండు కుంచాలో ధాన్యాన్ని కొలిపించుకుని భుజాలకెత్తుకుంటారీ భట్రాజులు.

                   కొమ్మదాసర్లు:

అన్ని పనులు పూర్తి చేసుకున్న తరువాత కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఈ కొమ్మదాసరోడు వచ్చి పెరట్లో చెట్టుకొమ్మనెక్కి 'అప్పయ్య గోరో పడతా పడతా నే పప్పుదాకలో పడతా,పడతా పడతా నే పాతరగోతిలో పడతా'అంటూ అల్లరి చేస్తాడు. అమ్మలక్కలు ,పిల్లలు చెట్ల క్రింద జేరి క్రిందకు దిగమని బ్రతిమాలతారు.ఆ పాతరగోతి మీద పాతబట్టలు పరచమని చెప్పి వాటిని పట్టుకెడతాడు.

ఇక్కడ పాతరగోతి గురించి చెప్పాలి.పూర్వం పండిన పంటను ఇంటికి తెచ్చి పెరట్లో గొయ్యి తవ్వి ఆ గోతిలో తాటాకులు కొబ్బరాకులు పరిచి వాటీపైన గడ్డి పరిచి మెత్తను తయారుచేసి ఆపైన ధాన్యం పోసి నిలవచేసే వారు.

దీనినే పాతరగొయ్యి అంటారు.పొద్దన్నుంచి పని చేసి చేసి అలసి సొలసి నిద్రపోతారేమో ఇదే సందని దొంగలు ఆ గోతిని తవ్వి పండిన పంటనంతా దోచుకుపోవచ్చు.మీ పాతరగొయ్యి సరిగా ఉందో లేదో ఓ సారి చూసుకోండి అని చెప్పడానికి ఈ కొమ్మదాసరి వస్తాడు.

ఈవిధంగా ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మన పొలాలకు పహారా ఇస్తారు.

మనకింత సాయం చేసిన వాళ్ళకు మనమేమిస్తున్నాము?

నాలుగు గుప్పెళ్ళ బియ్యం,నాలుగు పాత గుడ్డపీలికలు.

ఇంటిల్లిపాది మంచిని కోరుకుంటూ మన ముంగిటికొచ్చే కళాకారులను ఆదరించండి!!!

వెండితెరపై, బుల్లితెరపై ఓ సారి కనబడిన వాళ్ళందరికీ వేలు,లక్షలు పోసి వాళ్ళ వెకిలి చేష్టలను ఆనందించేకన్నా మన సౌఖ్యాన్ని,మన సౌభాగ్యాన్ని కోరుకునే ఈ పల్లె కళాకారులను అక్కున జేర్చుకుందాం!!!

మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం.

నిజమైన సంక్రాంతి సంబరాలను చేసుకుందాం.

సంక్రాంతి సంప్రదాయాలు.

▶️హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి.

💥ముగ్గులు.....

ఓర్పును నేర్పే కళ…

▶️ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.

💥భోగిమంటలు.

వ్యామోహానికి నిప్పు

▶️మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి.  అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.

💥గంగిరెద్దులు, హరిదాసులు....

భిక్షానికీ ఓ ధర్మం..

▶️ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.

💥గుమ్మడికాయ....

తీగల్లా అల్లుకుపోవాలి..!

▶️ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.

💥గొబ్బెమ్మలు....

అసహ్యం నుంచి అద్భుతం...!

▶️కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు .

💥భోగిపండ్లు

యోగిత్వం.. బదరీఫలం..!

▶️సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు  తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.

💥గాలిపటం.

దారంలాంటిది జీవితం..!

▶️ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

💥కోడిపందేలు.

యుద్ధనీతిని గెలిపించే పందెం

▶️పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది.  యుద్ధనీతిని తెలియజేసింది.

💥పశు పూజలు

శ్రమకు కృతజ్ఞత..!

▶️సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.



Post a Comment

About Me

Feature